Wednesday 25 May 2016

తను నేను చివరకు నేను

భీమవర౦ టౌన్ రైల్వే స్టేషన్ వచ్చింది. ట్రైన్ దిగి స్టేషన్ భయటకు వచ్చాను. ఎక్కడికి పోవాలండి? అన్న ఆటోవాడితో చినపేట అని చెప్పి ఆటో ఎక్కాను. సరిగ్గా ఇంటి ముందు దిగగానే నా కళ్ళు ఒకరి కోసం వెతికాయి. స్నానం చేసి వచ్చి టిఫిన్ తిన్న తర్వాత న్యూస్ పేపర్ తిరగేస్తున్నాను. పేపర్ చూస్తున్నాను కానీ నా మనసు పేపర్ లోని వార్తల మీద లేదు. నా కళ్ళు ఆమె కోసం వెతికాయి, నా చెవులు ఆమె మృదువైన స్వరం వినడానికి ఆరాటపడ్డాయి. కానీ నా కళ్ళకు, చెవులకు నిరాశే ఎదురైంది. అక్కడున్నన్ని రోజులు నేను తనతో గడిపిన క్షణాలే నా కళ్ళ ముందు కదలాడుతుండేవి. తను రాలేదు, నన్ను పూర్తిగా మర్చిపోయింది. భారంగానే ఇంటిని విడిచి ట్రైన్ లో హైదరాబాద్ కి బయల్దేరాను. సమయం 10, అందరూ నిద్రకు ఉపక్రమించారు. నేను కూడా నిద్రపోదామని కళ్ళు మూసాను, అలా మూయగానే నా మధురమైన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను.
**********
అప్పుడు నేను 8 తరగతి చదువుతున్నాను. ప్రతి ఆదివారం చర్చి కి వెళ్ళడం, చర్చి అయిపోగానే సండే స్కూల్ కి వెళ్ళడం తప్పనిసరి. రోజులు చాలా సరదాగా ఉండేవి.
అప్పుడు ప్రతి సంవత్సరం చర్చిలో బైబిల్ క్విజ్ పెట్టేవారు. నేను బాగా ప్రిపేర్ అయ్యాను. నాతో పాటు అయిదుగురు మాత్రమే ఉన్నారు. మేమందరం క్విజ్ కి సిద్ధమయ్యాం. ఇంతలో ఒకమ్మాయి వచ్చి ఒక్క 5 నిమిషాలు ఆగమని చెప్పింది. ఎందుకని అడిగితేతన ఫ్రెండ్ వస్తోందని చెప్పింది. ఎవరా అమ్మాయి అని ఆలోచిస్తుండగానే తను వచ్చింది. అమాయకంగా కూర్చుంది. తనను చూడగానే నాలో ఏదో కలవరం మొదలైంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయం వేసిందిగుండె  ఆగిపోతుందేమోనని. తన అమాయకత్వం నన్ను విపరీతంగా ఆకర్షించింది. తనను అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అందరూ నన్నే చూస్తుండడంతో కొంచెం కంట్రోల్ చేసుకున్నాను. క్విజ్ లో నేనే గెలిచాను. ఆనందం కంటే తనను చూసిన అనుభూతే నాకు ఎక్కువ సంతోషం కలిగించింది.
మరుసటి రోజు అంత్యాక్షరి. టీం కి నలుగురుండాలి. నాతో కలిపి ముగ్గురున్నాం. ఇంకొకరు కావాలి. నాకు తెలిసిన ఒకమ్మాయిని అడిగాను. పాటలు రావని చెప్పింది. నిరుత్సాహపడ్డాను.
నా ఫ్రెండ్ బాగా పాడుతుంది, తను వస్తుందిలే అంది.
అమ్మాయి ఎవరో కాదుతనే. మళ్లీ నాలో కలవరం మొదలైంది.
అంత్యాక్షరి మొదలైంది. నేను తననే చూస్తున్నాను కానీ మిగతా ఇద్దర్ని అస్సలు పట్టించుకోలేదు. అసలు ఇద్దరు ఎవరో కూడా నాకు ఇప్పటికీ గుర్తురావడం లేదు. సమయం చాలా ఎంజాయ్ చేసాను, గాల్లో తేలిపోయానన్నమాట. మాకు 2nd ప్రైజ్ వచ్చింది(నేను కొంచెం concentration పెట్టుంటే 1st వచ్చుండేది). కొన్ని నెలలు గడిచాయి. తనింక నాకు కనపడదు అని డిసైడ్ ఐపోయాను.
**********
మా ఇంటి పక్క పోర్షన్ కాలీ అయ్యి నెల రోజులైంది. అప్పుడే ఎవరో కొత్తగా ఇంట్లోకి దిగారు. ఇంట్లో నుండి కుక్క అరుపులు వినిపిస్తున్నాయి. నాకసలే కుక్కలంటే పడదు(భయం). వీల్లెవరో కుక్కని పెంచుకుంటున్నట్టున్నారు, అయితే వీళ్ళకు కొంచెం దూరంగా ఉండాలనుకున్నాను. తర్వాత రోజు నేను వరండాలోకి వచ్చి నిలుచున్నాను. సడన్ గా పక్కింట్లో నుండి ఒక తెల్లని బొచ్చు కుక్క వచ్చింది. నాకు కుక్కలంటే పడదు కాబట్టి మెల్లిగా ఇంట్లోకి వెళ్తున్నాను.
ఇంతలోజూలీఅన్న స్వరం విని అక్కడే ఆగిపోయాను. ఒకమ్మాయి భయటకు వచ్చి కుక్కని లోపలికి తీసుకువెళ్ళింది. నాకు షాక్. ఎందుకంటే నా గుండె వేగంగా కొట్టుకుంటోంది కాబట్టి. క్షణం ఎందుకు ఆనందించానో అర్ధం కాలేదు నాకు.
తర్వాత మాములుగానే రోజులు గడుస్తున్నాయి. నేను, తను పెద్దగా మాట్లాడుకున్న సందార్భాలు లేవు. చిన్న వయసు కదా, ఏముంటాయి?
తను కూడా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేది కాదు. తనుంటే మాత్రం నా మనసు చాలా హాయిగా ఉండేది. అప్పుడప్పుడు నేను జూలీని, అదేనండి కుక్క - బొచ్చు కుక్కని ఆడించేవాడిని(ఆడించాల్సొచ్చేది, తనతో ఉన్నప్పుడు తప్పదు కదా).
అలా ఆరు నెలలు గడిచాయి. మళ్లీ తను మాయం. ఇల్లు కాలీ చేసి వెళ్ళిపోయారు.
**********
నా పదవ తరగతి పూర్తయ్యింది. ఇల్లు కూడా మారాల్సి వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ కాబట్టి ఆదిత్య కాలేజీలో MPC తీసుకున్నాను. తను నాకు దూరమైనా అప్పుడప్పుడు గుర్తొచ్చి తెగ ఇబ్బంది పెట్టేది.
మొదటి సంవత్సరం పరీక్షలు దగ్గరపడ్డాయి. రోజు మ్యాథ్స్ ఎగ్జామ్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నా. దారిలో చిన్న వంతెన దగ్గరకు రాగానే చివరన ముగ్గురు అమ్మాయిలు కనిపించారు. ఎందుకో చూడాలనిపించి అలా చూసా - అంతే...నా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. నా కళ్ళు ఎవరినైతే చూసాయో అక్కడే ఆగిపోయాయి. చాలా కాలం తర్వాత చూసాయి కదా - అందుకే అలా చూస్తూ ఉండిపోయాయి నా చచ్చు కళ్ళు. నేను వంతెనకు ఇవతల, తను అవతల ఉన్నాం. మధ్యలో వాహనాల Background మ్యూజిక్(BGM).
నా కళ్ళు తనను చూడడం తను చూసింది. అంతే - నాకు, నా కళ్ళకు ఎటువంటి సక్రమ సంబంధమూ లేనట్టు వెర్రి చూపు చూసాను.
నీది సెంటర్?” అరిచింది.
DNR” అని చెప్పిమరి నీ సెంటర్ ఏంటి?” అరిచాను.
తను ఏదో చెప్పింది కానీ BGM లో సరిగ్గా వినపడలేదు. తన దగ్గరకు వెళ్లి ఏదొకటి మాట్లాడాలనిపించింది. కానీ ధైర్యం చెయ్యలేక అక్కడ నుండి కదిలాను.
ఎలా వచ్చానో తెలీదు, నా సైకిల్ నా ఇంటి ముందు ఆగింది. తనను చూసిన ఆనందంలో ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలియడం లేదు. కొంపతీసి ఇది ప్రేమా? నేను తనని ఇష్టపడుతున్న మాట నిజమే, కానీ దీన్ని ప్రేమనాలా? లేక ఒట్టి ఆకర్షణా? సరే ఇప్పుడిదంతా ఎందుకు? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తీరిగ్గా ఆలోచిద్దాం అని నాకు నేను సర్దిచెప్పుకుని, కొంచెం కంట్రోల్ లో ఉండమని నా చిట్టి గుండెకి పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చాను.
తర్వాత రోజు కూడా రోడ్డు మీద నెమ్మదిగా సైకిల్ తొక్కుతున్నాను. నా కళ్ళు మాత్రం రోడ్డు మీద వెళ్ళేవాళ్ళనందర్నీ స్కానింగ్ చేస్తున్నాయి. ఎగ్జామ్ అయిపోయాక అదే వంతెన దగ్గరకు రాగానే మళ్లీ నా కళ్ళు స్కానింగ్ చేస్తున్నాయి. కానీ వాటికి నేత్రానందం కలుగలేదు. రోజూ ఇదే తంతు. ఎగ్జామ్స్ అయిపోయాయి. అప్పటినుండి తన ఆలోచనలు అధికమయ్యాయి. ఒకటే ఆలోచనప్రేమా? కాదా? అని. తను నా దగ్గర లేనప్పుడు ప్రేమైతే ఏంటి? ఇంకోటైతే ఏంటి?.
వేసవి సెలవుల్లో ఎవరో చెబితే విన్నాను, ఆకాశంలో రాలే చుక్కను చూస్తూ ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని. నేను నమ్మలేదు, ఎందుకంటే నాకు జాతకాలు, జ్యోతిష్యం - వీటి మీద నమ్మకం లేదు. రోజు రాత్రి మేడ మీద ఒంటరిగా కూర్చున్నాను. ఏమీ తొయ్యట్లేదు. అనాశాక్తిగా ఆకాశం వైపు చూసాను. ఒక చుక్క రాలుతున్నట్టు గమనించాను. వెంటనే నా రెండు చేతులు జోడించి ఒక్కటే కోరుకున్నాను, “తనతో నా పెళ్లి జరగాలి.
**********
ఇంటర్ రెండవ సంవత్సరం మొదలయ్యింది. మళ్లీ ఎగ్జామ్స్ వచ్చాయి. ఈసారి నా సెంటర్కస్తూరి భాయి మహిళా కళాశాల. నా ఇంటి దగ్గరలో ఉండే ఒకబ్బాయిది కూడా అదే సెంటర్. రెండు సైకిళ్ళు ఎందుకని, వాడి సైకిల్ మీద ఇద్దరం కలిసి వెళ్ళొచ్చేవాళ్ళం. ఒక రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇద్దరం ఇంటికి వెళ్తున్నాం. వాడు సైకిల్ తొక్కుతుంటే నేను వెనక కుర్చుని ఉన్నాను. ఎదురుగా ఒకమ్మాయి సైకిల్ మీద వెళ్ళడం చూసాను. నా గుండె వేగంగా కొట్టుకోవడం నాకు అర్ధమైంది. సైకిల్ ఫాస్ట్ గా తొక్కి అమ్మాయి దగ్గరకు తీసుకెళ్ళమని చెప్పాను. ఆమె పక్కగా సైకిల్ వచ్చేటప్పటికి తను నన్ను చూసింది. నేనుహాయ్ అన్నట్టుగా ఒక నవ్వు పడేసిఎగ్జామ్ ఎలా రాసావు అనడిగా. “బాగానే రాసాను అంది. ఇంకేం మాట్లాడాలో నాకు తొయ్యట్లేదు. అప్పుడు నా చేతిలో మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఉంది. వెంటనే పేపర్ తీసి తనకు చూపిస్తూ ప్రాబ్లం చాలా కష్టంగా ఉంది, నువ్వు చేసావా అనడిగాను. తను ఏమీ చెప్పకుండా కొంచెం అసహనాన్ని ప్రదర్శిస్తూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి నా వైపు చూసింది. నేను నోరెల్లబట్టుకుని చూస్తున్నాను. “నేను Bi.P.C” అని చిన్నగా చెప్పింది. వెంటనే నా నోరు మూసుకుపోయింది. ఇంకేం మాట్లాడలేకపోయాను. తనుఉంటాఅని నవ్వకుండానే వెళ్ళిపోయింది. నాకు మాత్రం నవ్వులు వినిపిస్తున్నాయి. కొంచెం తేరుకునిఎందుకు నవ్వుతున్నావురా?” అన్నా. “లేకపోతే ఏంటి Bi.P.C అమ్మాయిని మ్యాథ్స్ గురించి అడుగుతున్నావు అన్నాడు. తనను చూసిన ఆనందంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు.
వేసవి సెలవులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కాలీ చేసి చర్చి పక్కనున్న ఇంటికి మారాం. మా అమ్మానాన్నల బలవంతం మీద ఎంసెట్ రాసాను. తాడేపల్లిగూడెం ఆకుల గోపయ్య ఇంజనీరింగ్ కాలేజీలో CSE తీసుకున్నాను. ఇంటినుండి ప్రతిరోజూ బస్సులో కాలేజీకి వెళ్ళొచ్చేవాడిని. ఇంతలో మా ఇంటి ముందున్న మొదటి పోర్షన్ కాలీ అయ్యింది.
**********
నేను ఇంట్లో కుర్చుని టీవీ చూస్తున్నాను. కొత్తవారి మాటలు వినపడుతున్నాయి. అప్పుడర్ధమైంది కొత్తగా ఎవరో వచ్చారని. కొంతసేపటి తర్వాత ఎవరో నీళ్ళ పంపు కొడుతున్నారు. ఇప్పుడెవర్రా పంపు కొడుతోంది అని అలా చూసా. నిమిషం పాటు కన్నార్పకుండా అలానే చూస్తున్నాను. లాభం లేదని కిచెన్ లోకి వెళ్లి నీళ్ళు తాగి వచ్చాను. మళ్లీ పంపు శబ్ధం. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నా దృష్టంతా కుళాయి చప్పుడు మీద, నా మనసు కుళాయి కొడుతున్నవారి మీద ఉండిపోయింది. భూమి అడ్డదిడ్డంగా తిరుగుతున్నట్టుంది. మళ్లీ గ్లాసు నీళ్ళు తాగాను. తను ఇక్కడేం చేస్తోంది? అంటే కొత్తగా అద్దెకొచ్చింది వీళ్ళేనన్నమాట. ఇప్పుడేంచేద్దాం? కొంతసేపు ఆలోచన తర్వాత, మూలనున్న నా తమ్ముడి క్రికెట్ బ్యాట్ కనిపించింది. బ్యాట్, బాల్ తీసుకుని భయటకు వచ్చి ఎదురింటి పిల్లాడిని పిలిచాను. వాడు ఆశ్చర్యంగా చూస్తూ నా దగ్గరకు వచ్చాడు. “ఏంటన్నయ్య అన్నాడు. మేడపైన క్రికెట్ ఆడదాం వస్తావా? అన్నాను. సరే అన్నయ్య అంటూ మేడ పైకి పరుగెత్తాడు. నేను మెల్లిగా మెట్లు ఎక్కుతుంటే తను సడన్ గా భయటకు వచ్చింది. నేను ఏమీ ఎరుగనట్టునువ్వా? మీరేనా కొత్తగా అద్దెకొచ్చింది, ఎప్పుడు దిగారు? అనడిగాను. “ఇందాకే అంది. అలాగా అంటూ నేను మేడ పైకి వెళ్లాను. పైన ఉన్నా, నా కళ్ళు మాత్రం కిందనే ఉన్నాయి. నేను తనని మరచిపోయానో లేదో అని తేల్చుకునే సమయంలో వచ్చి నన్ను ఎటూ తేల్చుకోలేకుండా చేసింది. తను - తన మేనత్త, మావయ్యలతో ఉంటోంది. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో తను చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గరే పెరిగింది.
ఎప్పుడూ ఇంట్లో టీవీ చూస్తూ గడిపేసే నేను భయటకు వచ్చి పిల్లలతో కొంచెం సమయం కూడా గడుపుతున్నాను. తను ప్రతిరోజూ మా ఇంటికి వచ్చేది. “ధన్యవాదాలు దేవుడా వాళ్లకు టీవీ లేదు".
అమ్మాయిలతో మాట్లాడడం కాదు కదా, అసలు అమ్మాయి కనపడితే తల దించుకుని వెళ్ళిపోయే నేను, తనతో మాటలు కలపడానికి చాలా ఇబ్బంది పడేవాడిని.
ఒక రోజు సాయంత్రం తను మా ఇంటికి వచ్చింది. సరిగ్గా అప్పుడే మా అమ్మ వాళ్ళ అత్త షాపింగ్ చెయ్యడానికి వెళ్ళారు. తను టీవీ చూస్తోంది. ఏం మాట్లాడాలబ్బా? అని ఆలోచిస్తుండగాహాయ్ అంటూ పిడుగులా ఊడిపడ్డాడు పిడుగు రాముడు(మా ఇద్దరి కామన్ ఫ్రెండ్). “ఇప్పుడొచ్చావేంట్రా వెధవ అని మనసులోనే అనుకునిఏంట్రా ఇలా వచ్చావు కోపంగా నవ్వాను. “ఊరికినే అని నవ్వుతున్నాడు. చాలాసేపయింది. వాడు కదల్లేదు. తనతో ఏకాంతంగా గడిపే సమయాన్ని చెడగొట్టేసాడీ దయిద్రపు ఎదవ అని మనసులో తిట్టుకున్నాను. “సరే ఉంటారా అంటూ లేచాడు. వాడిని పంపించిహమ్మయ్య శనిగాడు పోయాడు అంటూ లోపలికి వచ్చాను. అలా కూర్చోగానే ఎవరో వచ్చినట్లనిపించింది. ఇంకెవరు, మా అమ్మగారు వీళ్ళ మేనత్త గారు. వాళ్ళు రాగానే తను లేచి వెళ్ళిపోయింది. నా అదృష్టాన్నిపచ్చి సంస్కృతంలో అభినందించాను.
**********
తను ఒక కాలేజీ లో BSC నర్సింగ్ తీసుకుందని తెలిసింది. తను కాలేజీకి వెళ్ళడం మొదలయ్యింది. తనెప్పుడు వెళ్ళేదో నాకు తెలిసేది కాదు. ఒక రోజునువ్వు కాలేజీకి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది. పొద్దున్న 7:30 కి వెళ్తాను అని చెప్పా. “నేను కూడా అటు ఇటుగా టైంకే వెళ్తున్నాను, కలిసి వెళ్దామా అంది. తర్వాత రోజు ఇద్దరం కలిసి బస్ స్టాప్ కి చేరుకున్నాం. నా బస్ రాగానే బ్యాగ్ సీట్ లో పెట్టి వచ్చినువ్వు ఎప్పుడు వెళ్తావు అన్నాను. “నాకు కాలేజీ 9:30 కి, రోజూ ఒక్కద్దాన్నే వెళ్తున్నాను, నీతో కలిసి వెళ్దామనిపించింది - అందుకే త్వరగా వచ్చా అంది. ఏం మాట్లాడాలో తెలియలేదు.
**********
అది ఏప్రిల్ నెల, పవన్ కళ్యాణ్ జల్సా సినిమా విడుదలైన రొజు. నేను నా క్లాస్ మేట్స్ తో భీమవరం అన్నపూర్ణ థియేటర్ లో జల్సా చేసాం. సాయంత్రం మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు జల్సా టాపిక్ వచ్చింది. “నాకు చూడాలని ఉంది అంది. “సరే ఒకరోజు వెళ్దాం అన్నాను.
బస్ స్టాప్ కి వెళ్తుండగా ఏదో పేపర్ లాంటిది నా బ్యాగ్ లో పెట్టింది.
ఏంటిది?
లెటర్..బస్ లో చూడు అంది.
బస్సు ఎక్కిన వెంటనే తెరిచాను. ప్రేమలేఖ కాదు కానీ, నీతో ఎక్కువగా మాట్లాడాలని ఉంది, ఇంటి దగ్గర కుదరడంలేదు..అదీ..ఇదీ..రాసింది. దానికి బదులుగా నేను కూడా ఒక లెటర్ రాసాను. అలా ప్రతిరోజూ లెటర్స్ తో మా ఫీలింగ్స్ ని షేర్ చేసుకునేవాళ్ళం. ఇలా మా స్నేహం లేఖలతో పటిష్టమవుతున్న సమయంలో వాళ్ళ మావయ్య తనకు ఫోన్ కొనిచ్చాడు. లెటర్స్ తగ్గాయి. అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళం. రొజు తను నాకు ఫోన్ చేసి ఐస్ క్రీం పార్లర్ కి రమ్మంది.
అసలు మా ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? తను నన్ను ప్రేమిస్తోందా? లేక ఒక మంచి స్నేహితుడిలా నన్ను చూస్తోందా? ఇలాంటి ప్రశ్నలు నా దగ్గర చాలా ఉన్నాయి. సమాధానాలు మాత్రం తన దగ్గరే ఉన్నాయి.
ఊహల లోకంలో విహరిస్తున్న నేను ఫోన్ మోగగానే తేరుకున్నాను. "అన్నపూర్ణ థియేటర్ దగ్గరున్నాను రా అన్న తియ్యని గొంతు.
సినిమా చూస్తుండగా మధ్యలోనన్ను లవ్ చేస్తున్నావా తను నన్ను సూటిగా అడగడంతో నా గుండె ఆగిపోయినట్టనిపించింది. చాలా కంగారుగా, దిగాలుగా ముఖం పెట్టి అవునన్నట్టుగా తల ఊపాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పిచ్చెక్కినట్టనిపించింది. తను ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు.
నువ్వంటే నాకు ఇష్టమే కానీ ప్రేమంటేనే కుదరదు. ఎందుకంటే మా నాన్నంటే నాకు భయం. నేను ప్రేమించానని తెలిస్తే ఊరుకోరు. నన్ను అర్ధం చేసుకో అని sms. “నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని చెప్పు లేదంటే లేదని చెప్పు, అంతేకాని నువ్వు confuse అయ్యి నన్ను కూడా confuse చెయ్యకు ఇదీ నా రిప్లై. తర్వాత రొజు తననుండి sms. అది చూసిన తర్వాత నాకు విపరీతమైన ఆనందం. ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ ని నేనే.
రొజు రాత్రి మేడపైన తనని కలిసి నా సంతోషాన్ని వ్యక్తపరిచాను. నా భుజంపై తన తలని వాల్చి లవ్ యు అంది. సమయం కోసమే ఇన్నాళ్ళ నా నిరీక్షణ. తర్వాత రొజు కూడా అదే సమయానికి కలిశాం. “నేను నా ఫ్రెండ్ కి మన విషయం చెప్పాను, ముద్దు పెట్టాడా అని అడిగింది, లేదని చెప్పాను. రేపు కూడా అడుగుతుంది, ఏమని చెప్పను? అని అమాయకంగా నా వైపు చూడగానే నాకు ముచ్చటేసింది. “పెట్టానని చెప్పు అన్నాను. “అలాగే అని తను తల దించుకోగానే తన బుగ్గ మీద ముద్దు పెడుతూఇప్పుడు ధైర్యంగా చెప్పు నీ ఫ్రెండ్ కి. తను నవ్వింది.
నాలో ఏం చూసి ప్రేమించావు? అని చాలా సార్లు అడిగింది. నేను ఎప్పుడూ సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకంటే, నాకే తెలియదు కాబట్టి. తన అమాయకత్వం నచ్చిందా, చిలిపితనమా, చిన్న పిల్లల మనస్తత్వమా, దానికి మించి తన అందమైన చిరునవ్వుని చూసి ఇష్టపడ్డానా? చెప్పలేను. తనలో ఏదో ఉంది అదే నాకు నచ్చింది.
**********
నేననుకున్నది సాధించాను. తన ప్రేమని గెలుచుకున్నానని పొంగిపోయేవాడిని. తన ప్రేమను సొంతం చేసుకున్నానని విర్రవీగిపోయిన నేను గెలుచుకున్న తన ప్రేమను కాపాడుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాను. దానికి కారణం నేనే. ముమ్మాటికీ నేనే. ప్రేమించుకునే ప్రతి వాళ్ళకీ తలెత్తే సమస్యే నాకూ వచ్చింది. కానీ నేను సమస్యలను పట్టించుకోకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను. అదే నేను చేసిన అతి పెద్ద తప్పు.
**********
మొదట్లో మా మధ్య ఎటువంటి సమస్యా లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ తనపై నాకు చిన్న చూపు మొదలైంది. ప్రతి చిన్న విషయానికీ తనపై కోపాన్ని ప్రదర్శించేవాడిని. తను మాత్రం నాపై ఎప్పుడూ చిన్న అసహనాన్ని కూడా చూపలేదు. చాలా సార్లు కోపమొచ్చినప్పుడల్లా తన అమాయకత్వంతో నన్ను కట్టిపడేసేది. కానీ నాలో ఉన్నమగాడు ప్రేమికుడిని డామినేట్ చెయ్యడం మొదలెట్టాడు. నేను ఫోన్ చేసినప్పుడు తన ఫోన్ బిజీ వస్తే చాలా కోపం వచ్చేది. “ఎవడితో మాట్లాడుతున్నావు? ఎవడాడు? ఎందుకు మాట్లాడుతున్నావు వాడితో? వాడికీ నీకూ సంబంధం ఏమిటి అంటూ తనని చాలా ఇబ్బంది పెట్టేవాడిని.
నాకు ఫోన్ చేసినేను ఇంటికి వెళ్తున్నాను, ట్రైన్ మూడు గంటలకు అని చెప్తేసరే వెళ్ళు అని కాల్ కట్ చేసేవాడిని. నాకు తెలుసు తను ఏం కోరుకుంటుందో. ఒకసారి స్టేషన్ కి వెళ్తే ఏం పోతుంది అని అనుకునేవాడిని కూడా కాదు. తన మీద నాకు ప్రేమ కంటే అధికారం ఎక్కువైంది.
చదువు నిమిత్తం తను భీమవరం వదిలి రాజమండ్రి వెళ్ళింది. తను నాకు దూరంగా ఉన్నా, రోజూ ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళం. నా మాటల్లో ప్రేమ, ఆప్యాయత కరువైంది. అది తనకు బాగా అర్ధమైంది. నాలో ఏంటీ మార్పు? అని ఒక్కసారి కూడా నాకు నేను ఆత్మపరిశీలన చేసుకోలేదు. ఒకరోజు నేను చదువుకుంటుండగా తను ఫోన్ చేసింది. “నేను చదువుకుంటున్నాను, ఎగ్జామ్స్ అయ్యేంతవరకు కాల్ చెయ్యకు అని కాల్ కట్ చేసాను. మూడు రోజుల తర్వాత మళ్లీ కాల్ చేసింది. “నీకు బుద్ధిలేదా? చెయ్యొద్దని చెప్పాను కదా మళ్లీ ఎందుకు చేసావు అని కఠినంగా చెప్పాను. “ప్లీజ్ నాతో మాట్లాడు అని తను అంటుండగానేపెట్టేయ్ అని చాలా నిర్లక్ష్యంగా కాల్ కట్ చేసాను. ఎగ్జామ్స్ అయిపోయాయి. నెల రోజులు గడిచిపోయాయి. తన నుండి కాల్ రాలేదు. నాకు కూడా చెయ్యాలనిపించలేదు. మరో వారం తర్వాత నేనే చేసాను. “ఏంటి ఫోన్ చెయ్యడం లేదు, మర్చిపోయావా? అన్నాను విసుగ్గా. “అవును అంది నవ్వుతూ. “జోకులొద్దు, ఏంటో చెప్పు అనడంతోజోక్ కాదు నిజంగానే, ఇంకెప్పుడూ నాకు ఫోన్ చెయ్యొద్దు. నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు కూడా నన్ను మర్చిపో. ఇంకో విషయంనేను ఇప్పుడు ఇంకొకర్ని లవ్ చేస్తున్నాను. ఇక నువ్వు నా జీవితంలోకి రావద్దు కాల్ కట్ చేసింది. అంతకంటే నా పీక కట్ చేసినా బాగుండునేమో అనిపించిందా క్షణం. అంటే తనను నేను అంతలా బాధపెట్టానా? అప్పుడప్పుడూ కాల్ చేసేవాడిని, కట్ చేసేది. అప్పుడనిపించింది, ఇదంతా నా వల్లనే కదా జరిగింది. చిన్నతనం నుండి తనను ఇష్టపడ్డ నేను ఎందుకు తన ప్రేమను కాపాడుకోలేకపోయాను? అది కేవలం నా నిర్లక్ష్యం. నేనెంత సరిదిద్దుకోలేని తప్పు చేసానో నాకు తెలిసొచ్చింది. కానీ అప్పటికే నేను నాసర్వశ్వాన్నీ కోల్పోయాను. తర్వాత నేను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. నా ప్రవర్తన తనపై ప్రేమ చూపిస్తున్నట్టు నన్ను మోసం చేసింది. తను నన్ను మర్చిపోయింది. తనని మర్చిపోవడానికి నేను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను. నేను నావైపు నుండే ఆలోచించాను తప్ప తన వైపు నుండి ఏనాడూ ఆలోచించే ప్రయత్నం చెయ్యలేదు. నువ్వు నాకు కావాలి అని అడిగే అర్హతను పూర్తిగా కోల్పోయాను. స్వయంకృపరాధానికి పరిష్కారం లేదు. ప్రేమను గెలవడం వేరు, ప్రేమను కాపాడుకోవడం వేరు. విషయం నాకు తెలియక చాలా తప్పులు చేసాను. ఉరిశిక్ష పడేవాడిని కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. ఆఖరి అవకాశం కూడా లేని ఉరిశిక్షను అనుభవిస్తున్నాను నేను. ఇప్పుడు నేను కోరుకుంటున్నది ఒక్కటే, తను ఇష్టపడిన వాడితో తన పెళ్లి జరిగి వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండాలని. తను నన్ను వదిలి వెళ్లిపోయినప్పటినుండి ఇప్పటిదాకా నా గుండె ఎప్పుడూ వేగంగా కొట్టుకోలేదు.

No comments:

Post a Comment

Comments System

Disqus Shortname

Disqus Shortname

Comments system