Wednesday 25 May 2016

మగ బుద్ధి

ఒక సంవత్సరం నుండి ఆ అమ్మాయిని చూస్తున్నాను. ఛామనచాయ రంగులో అందంగా కనపడేది. నేను, నా ఫ్రెండ్స్ రోజూ తనని గమనించేవాళ్ళం. మేము భీమవరంలో బస్సు ఎక్కేవాళ్ళం. తను పిప్పర లో ఎక్కేది. తాడేపల్లిగూడెంలో బస్సు దిగేంత వరకూ మా అందరి చూపు తన మీదే. తను ఒక అబ్బాయితో చనువుగా మాట్లాడడం గమనించాం. బస్సులో పక్కపక్కనే కూర్చునేవారు. కొన్ని రోజుల తర్వాత తను ఒంటరిగానే బస్సులో వెళ్తోంది. వారం రోజుల తర్వాత తాడేపల్లిగూడెం బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా తను ఒక కుర్రాడితో కలిసి రావడం చూసాను. ప్రతి రోజూ ఇద్దరు పక్కపక్కనే కూర్చుని బస్సు వచ్చేంత వరకు మాట్లాడుకునేవారు. బస్సు రాగానే తనని బస్సు ఎక్కించి వీడు వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత వాడు కూడా రావడం మానేసాడు. ఒక అమ్మాయిని ఒంటరిగా ఉండనివ్వరు కదా మన అబ్బాయిలు, వెంటనే నా స్నేహితుడు చంద్ర రంగంలోకి దిగాడు. తనతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం మొదలెట్టారు. ఏమైందో తెలీదు తను వీడితో మాట్లాడటం మానేసింది. ఐ లవ్ యు చెబితే రిజెక్ట్ చేసుంటుంది అని అనుకున్నాం. కాని వాడు ఐ లవ్ యు చెప్పలేదట, రూం కి వస్తావా అని అడిగాడట. మతి పోయింది నాకు. చంద్ర బలవంతం మీద నేను తనతో మాట్లాడాల్సి వచ్చింది. మావోడు చేసింది తప్పే క్షమించమని ఎంత చెప్పినా వినలేదు. అవకాసం దొరికేసరికి తనతో రోజు మాట్లాడటం మొదలెట్టాను. తను బస్సులో నా పక్కేనే కూర్చోవడం మొదలెట్టింది. ఫోన్లు చేసుకోవడం కూడా మొదలయ్యాయి. మేమిద్దరం బాగా దగ్గరయ్యామని తెలుసుకున్న చంద్ర నాతో తన గురించి చాలా విషయాలు చెప్పాడు. తను మంచిదికాదని, చాలామందితో తిరిగిందని, రెండుసార్లు కడుపు తీయించుకుందని చెప్పాడు. ఆ మాటలతో నాకు తనపై విరక్తి కలిగింది. ఆ రోజు తన కాలేజీ ఆఖరి రోజు. బస్సులో నా పక్కన కుర్చుని, రేపటి నుండి నేను నిన్ను కలవలేను అని చెప్పి నా కళ్ళల్లోకి చూసింది. మనం రోజూ ఫోన్లో మాట్లాడుకుందాం అని నా భుజం పై తలపెట్టి పడుకుంది. నిద్రలో తన కళ్ళనుండి కన్నీళ్లు కారడం గమనించాను. అయినా తనని లేపలేదు. పిప్పర దగ్గరకు వస్తుండగా లేపాను. నన్ను మరచిపోవు కదూ అంటూ నా కళ్ళల్లో ఏదో వెతికింది. బస్సు కదిలింది. దరిద్రం వదిలిపాయింది అనుకున్నాను. తను రోజూ ఫోన్ చేసినా నేను పట్టించుకోలేదు. తర్వాత నేను కొత్త నెంబర్ తీసుకున్నాను. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఒక చిన్న పనిమీద తాడేపల్లిగూడెం వెళ్లాను. అక్కడ తన స్నేహితురాలు కనిపించింది. ఆమె చెప్పింది విన్నాక కుప్పకూలిపోయాను నేను. తను Brain Tumour తో చనిపోయిందన్న విషయం జీర్నించుకోలెకపోయాను. ఒక్కసారిగా తనతో గడిపిన క్షణాలు గుర్తుకొచ్చేసరికి ఏడుపాపుకోలేకపోయాను. తనకు Brain Tumour అని ఎవ్వరికీ చెప్పలేదేందుకు. ఎందుకలా చేసింది? సానుభూతి పొందడం ఇష్టం లేకా? అందరూ తన అందం కోసం వెంపర్లాడుతుంటే తను మాత్రం స్వచ్ఛమైన స్నేహం కోసం చూసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తన మనసుని అర్ధం చేసుకోలేదు. ఆఖరికి నేను కూడా అందరిలానే నా మగ బుద్ధిని చూపించాను. తన గురించి చెప్పినవన్నీ నిజమా కాదా? అని ఒక్కసారి కుడా ఆలోచించలేదు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నా కళ్ళల్లోకి చూడడానికి తను మాత్రం లేదు.

No comments:

Post a Comment

Comments System

Disqus Shortname

Disqus Shortname

Comments system