Wednesday 25 May 2016

మగ బుద్ధి

ఒక సంవత్సరం నుండి ఆ అమ్మాయిని చూస్తున్నాను. ఛామనచాయ రంగులో అందంగా కనపడేది. నేను, నా ఫ్రెండ్స్ రోజూ తనని గమనించేవాళ్ళం. మేము భీమవరంలో బస్సు ఎక్కేవాళ్ళం. తను పిప్పర లో ఎక్కేది. తాడేపల్లిగూడెంలో బస్సు దిగేంత వరకూ మా అందరి చూపు తన మీదే. తను ఒక అబ్బాయితో చనువుగా మాట్లాడడం గమనించాం. బస్సులో పక్కపక్కనే కూర్చునేవారు. కొన్ని రోజుల తర్వాత తను ఒంటరిగానే బస్సులో వెళ్తోంది. వారం రోజుల తర్వాత తాడేపల్లిగూడెం బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా తను ఒక కుర్రాడితో కలిసి రావడం చూసాను. ప్రతి రోజూ ఇద్దరు పక్కపక్కనే కూర్చుని బస్సు వచ్చేంత వరకు మాట్లాడుకునేవారు. బస్సు రాగానే తనని బస్సు ఎక్కించి వీడు వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత వాడు కూడా రావడం మానేసాడు. ఒక అమ్మాయిని ఒంటరిగా ఉండనివ్వరు కదా మన అబ్బాయిలు, వెంటనే నా స్నేహితుడు చంద్ర రంగంలోకి దిగాడు. తనతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చోవడం మొదలెట్టారు. ఏమైందో తెలీదు తను వీడితో మాట్లాడటం మానేసింది. ఐ లవ్ యు చెబితే రిజెక్ట్ చేసుంటుంది అని అనుకున్నాం. కాని వాడు ఐ లవ్ యు చెప్పలేదట, రూం కి వస్తావా అని అడిగాడట. మతి పోయింది నాకు. చంద్ర బలవంతం మీద నేను తనతో మాట్లాడాల్సి వచ్చింది. మావోడు చేసింది తప్పే క్షమించమని ఎంత చెప్పినా వినలేదు. అవకాసం దొరికేసరికి తనతో రోజు మాట్లాడటం మొదలెట్టాను. తను బస్సులో నా పక్కేనే కూర్చోవడం మొదలెట్టింది. ఫోన్లు చేసుకోవడం కూడా మొదలయ్యాయి. మేమిద్దరం బాగా దగ్గరయ్యామని తెలుసుకున్న చంద్ర నాతో తన గురించి చాలా విషయాలు చెప్పాడు. తను మంచిదికాదని, చాలామందితో తిరిగిందని, రెండుసార్లు కడుపు తీయించుకుందని చెప్పాడు. ఆ మాటలతో నాకు తనపై విరక్తి కలిగింది. ఆ రోజు తన కాలేజీ ఆఖరి రోజు. బస్సులో నా పక్కన కుర్చుని, రేపటి నుండి నేను నిన్ను కలవలేను అని చెప్పి నా కళ్ళల్లోకి చూసింది. మనం రోజూ ఫోన్లో మాట్లాడుకుందాం అని నా భుజం పై తలపెట్టి పడుకుంది. నిద్రలో తన కళ్ళనుండి కన్నీళ్లు కారడం గమనించాను. అయినా తనని లేపలేదు. పిప్పర దగ్గరకు వస్తుండగా లేపాను. నన్ను మరచిపోవు కదూ అంటూ నా కళ్ళల్లో ఏదో వెతికింది. బస్సు కదిలింది. దరిద్రం వదిలిపాయింది అనుకున్నాను. తను రోజూ ఫోన్ చేసినా నేను పట్టించుకోలేదు. తర్వాత నేను కొత్త నెంబర్ తీసుకున్నాను. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఒక చిన్న పనిమీద తాడేపల్లిగూడెం వెళ్లాను. అక్కడ తన స్నేహితురాలు కనిపించింది. ఆమె చెప్పింది విన్నాక కుప్పకూలిపోయాను నేను. తను Brain Tumour తో చనిపోయిందన్న విషయం జీర్నించుకోలెకపోయాను. ఒక్కసారిగా తనతో గడిపిన క్షణాలు గుర్తుకొచ్చేసరికి ఏడుపాపుకోలేకపోయాను. తనకు Brain Tumour అని ఎవ్వరికీ చెప్పలేదేందుకు. ఎందుకలా చేసింది? సానుభూతి పొందడం ఇష్టం లేకా? అందరూ తన అందం కోసం వెంపర్లాడుతుంటే తను మాత్రం స్వచ్ఛమైన స్నేహం కోసం చూసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తన మనసుని అర్ధం చేసుకోలేదు. ఆఖరికి నేను కూడా అందరిలానే నా మగ బుద్ధిని చూపించాను. తన గురించి చెప్పినవన్నీ నిజమా కాదా? అని ఒక్కసారి కుడా ఆలోచించలేదు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నా కళ్ళల్లోకి చూడడానికి తను మాత్రం లేదు.

మహర్జాతకుడు


సుభద్రమ్మ-రంగారావు దంపతులకు ఏడుగురు సంతానం. ఆరుగురుకి  పెళ్ళిళ్ళు చేసి చక్కబెట్టిన వీళ్ళకు ఆఖరువాడైన గంగాధరం పెళ్లి హడావిడిలో ఉన్నారు. నరసాపురం మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన జెలగల సంజీవరావు యొక్క కనిష్ట కుమార్తె సులోచనతో వివాహం నిశ్చయమైంది. తమ ఇంట్లో ఆఖరి శుభకార్యం కావడంతో సుభద్ర-రంగారావులు ఘనంగానే వివాహం జరిపించారు.
పాలగ్లాసుతో సిగ్గుపడుతూ గదిలోకి అడుగు పెట్టిన సులోచన భర్త పాదాలకు నమస్కరించింది. సులోచనని తన పక్కన కూర్చోమని చెప్పి, “నా పాదాలకు నమస్కరించమని ఎవరు చెప్పారు నీకు?” అని సున్నితంగా అడిగాడు.
మా బామ్మ అని నెమ్మదిగా చెప్పింది.
మీ బామ్మ ఇంకేమన్నా చెప్పిందా?” అని చెవిలో చెప్పాడు.
చెప్పింది అన్నట్టుగా తలూపింది సులోచన.
బామ్మ ఏమి చెప్పి ఉంటుందో అర్ధం చేసుకున్నాడు గంగాధరం. కొంతసేపు వారిద్దరి మధ్య నిశబ్దం. సులోచనకి చెమటలు పట్టడం మొదలయ్యాయి. సులోచన అలా ఉండటం గమనించిన గంగాధరం సులోచన భుజంపై చెయ్యి వేసాడు. సులోచన కొంచెం స్థిమితపడగానే  తన మనసులో మాటని చెప్పడానికి సిద్దపడ్డాడు.
మనకిప్పుడు పిల్లలు అవసరమా?”.
అర్ధం కానట్టుగా చూసింది సులోచన.
అంటే...నా ఉద్దేశం పిల్లలు వద్దని కాదు, ఇప్పుడు వద్దని. మనది సంసార బాధ్యతలు చేపట్టే వయసు కాదు. అప్పుడే పిల్లల్ని కని సంసారంలో ఈదడం నాకిష్టం లేదు. కాబట్టి మనకి ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని నా అభిప్రాయం.”
భర్త మాటను జవదాటకూడదు అని బామ్మ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి.
**********
పెళ్ళయ్యి మూడేళ్ళు కావొస్తున్నా కోడలి కడుపు పండకపోవడంతో ఆరా తీసిన సుభద్రమ్మకి అసలు విషయం తెలిసాక గంగాధరం మీద పట్టరాని కోపం వచ్చింది.
పెళ్లి చేసుకునేది పిల్లల్ని కనడానికి, అంతేగాని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చోవడానికి కాదు గంగాధారానికి వినపడేలా గట్టిగా అరుస్తోంది.
ఏవండి! వీడిని ఒకసారి డాక్టర్ కి చూపించండి. ఊళ్ళో అందరూ వీడి గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వీడికిచ్చి పెళ్లి చేసి పాపం పిల్ల గొంతు కోసాను సులోచనపై జాలేసింది సుభద్రమ్మకి.
రోజూ సుభద్రమ్మ-రంగారావులు పలు రకాలుగా గంగాధరాన్ని వేధించసాగారు. ఇవేమీ పట్టించుకునేవాడు కాదు గంగాధరం.
ఇంకో మూడేళ్లకి గాని సుభద్రమ్మ-రంగారావుల నోటిని మూయించలేకపోయాడు  గంగాధరం. కోడలు నెల తప్పిందని  తెలిసాక సుభద్రమ్మ-రంగారావుల ఆనందానికి హద్దంటూ లేకుండా పోయింది. సుభద్రమ్మ ఇరుగు పొరుగు వారందరికీ చెప్పింది. “నా కొడుకు మగాడు అని ఊళ్ళో అందరికీ చెప్పి మీసం మెలేసి తొడలు కొట్టుకుంటున్నాడు రంగారావు. రోజు ఇల్లంతా సందడిగా ఉంది. రాత్రి సుభద్రమ్మ-రంగారావులు ప్రశాంతంగా నిద్రపోయారు. రోజూ అందరికంటే ముందే నిద్రలేచే సుభద్రమ్మ మర్నాడు ఉదయం లేవలేదు. రోజు ఇల్లంతా శోక సంద్రంలో మునిగిపోయింది. సులోచన మాత్రం ప్రశాంతంగా ఉంది. తల్లినయ్యానన్న ఆనందం కంటే ఇదేమంత విషయం కాదనుకుంది. భార్య హఠాన్మరణంతో కృంగిపోయిన రంగారావు మంచం పట్టాడు.
**********
సులోచన మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన వెంటనే బిడ్డని తన తండ్రి చేతుల్లో పెట్టాడు గంగాధరం. మనవడిని చుసిన రంగారావుకి పట్టరాని సంతోషం కలిగింది. అంత ఆనందాన్ని రంగారావు గుండె తట్టుకోలేక ఆగిపాయింది. కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న గంగాధరం తన తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయాడు.
ముసలోడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్న సులోచననా కొడుకు మహర్జాతకుడుఅని పొంగిపోయింది.
 కొడుకు పుట్టిన రోజు, తండ్రి పోయిన రోజు ఒక్కటే కావడం ఇప్పటికీ గంగాధరం జీర్ణించుకోలేని విషయం. కడుపులో పడగానే తన తల్లిని, పుట్టాక తండ్రిని మింగేసాడని ఎప్పుడూ మనసులోనే మదనపడుతూ ఉండేవాడు.
ఒక రోజు కొడుక్కి జాతకం రాయించడానికి సుప్రసిద్ధ జ్యోతిష్య పండితులైన అమరవీర శైలేంద్ర శాస్త్రి వద్దకు వెళ్లారు. బాబుని చుసిన పండితుడు తన్మయత్వం చెందాడు. పిల్లాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మునికి XEROX కాపీలా  ఉన్నాడు, ఇతని పుట్టుక వలన దేశానికేదో మహత్కార్యమే జరగనుందని చెప్పాడు శాస్త్రి.
మాటలకు గంగాధరం ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అంతటితో ఆగలేక కొడుకు ముఖాన్ని ముద్దులతో తడిపేసాడు.
బాబు రోజున, సమయాన, ఎక్కడ పుట్టాడో చెబితే జాతక చక్రం ఇట్టే రాసేస్తాను చాలా తేలికగా చెప్పాడు.
ఆహా! మీవాడు ఒక మంచి శుభముహూర్తాన జన్మించాడన్న మాట, ఒక్క గంటలో బాబు జాతకం మీ చేతుల్లో ఉంటుంది అని చెప్పి జాతక చక్రం రాయడం మొదలెట్టాడు.
ఇంతలో బాబు ఉన్నట్టుండి ఏడుపు లంకించుకున్నాడు. బాబుని బయటనున్న సులోచనకి అప్పగించాడు గంగాధరం. ఆమె బుజ్జగించినా ఏడుపాపలేదు. ఆకలితో ఉన్నట్టు భావించిన సులోచన పాలు పట్టించింది. అయినా ఏడుపు ఆపలేదు.
అప్పటికే సమయం తొమ్మిది దాటింది. గంట అన్న సమయం కాస్త అయిదు గంటలు దాటడంతో శాస్త్రి వద్దకు వెళ్ళాడు. అప్పటికే శాస్త్రి గాల్లో ఏవో లెక్కలు వేస్తూ, తన బట్ట బుర్రను గోక్కుంటూ నానాయాతన పడుతున్నాడు.
నా జీవితంలో ఎప్పుడూ ఒక జాతకం రాయడానికి ఇంత సమయం పట్టలేదు. మీవాడి జాతకం మామూలు జాతకం కాదు, మహర్జాతకం. పురాణ కాలంలో ఉండే పుణ్య పురుషుల జాతకంలా ఉంది. ఎంతకీ నాకు అంతుబట్టడం లేదు. చక్రం ముందుకు కదలడం లేదు. ఇది నా జ్యోతిష్య పండిత శాస్త్రానికే పెద్ద పరీక్ష. ఎలాగైనా సరే దీన్ని నేను చేధిస్తాను, చేధించి తీరుతాను ఆవేశంగా చెప్పాడు.
గంగాధరం అయోమయంగా చూస్తున్నాడు.
ఎంత సమయమైనా సరే జాతక చక్రాన్ని పూర్తి చేయకుండా నేను ఇక్కడ నుండి కదలను. మీరు ఇంటికి వెళ్ళండి, రేపు ఉదయం రండి. జాతకం సంగతేంటో చూడకుండా నిద్రపోను నిట్టూర్చాడు శాస్త్రి.
బాబు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు.
జాతకం రాయించారా అండి, ఏమన్నారు శాస్త్రిగారు ఆత్రుతగా అడిగింది సులోచన.
శాస్త్రిగారు రేపు రమ్మన్నారు, వీడు మహర్జాతకుడట..” అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో సులోచన బాబుని గట్టిగా హత్తుకుంది.
ఇంటికి వెళ్ళినా ఏడుపాపలేదు బాబు. సులోచన తనకొచ్చిన పాటలన్నీ పాడేసి, ఇక ఓపిక లేక గంగాధరాన్ని పాడమని చెప్పింది. గంగాధారానికి పాటలు పాడడం రాదు, అసలే బొంగురు గొంతు...ఐనా బాబు ఏడుపాపడానికి విచ్చలవిడిగా పాడేసాడు. అయినా ఎడుపాపలేదు. గంగాధారానికి ఏమీ పాలుపోలేదు, పిల్లలు ఏడిస్తేనే ఆరోగ్యం అని సులోచనకి నచ్చజెప్పాడు. చేసేదేం లేక ఏడుపు వింటూ రాత్రంతా గడిపారు.
తెల్లవారుజామున సరిగ్గా నాలుగు గంటలకు ఏడుపాపి హాయిగా నిద్రపోతున్నాడు బాబు. “హమ్మయ్య అనుకుంటూ వారిరువురు ప్రశాంతంగా కొంచెం సేపు నిద్రపోయారు.
**********
ఏంటి ఇంతమంది జనమున్నారు? ఏమైంది?”. శాస్త్రి ఇంటి ముందు గుముగూడి ఉన్న జనంలో ఒకతన్ని అడిగాడు.
శాస్త్రిగారు ఉదయాన్నే పోయారుఅన్న సమాధానం విని ఆశ్చర్యపోయాడు.
రాత్రి బాగానే ఉన్నారు, ఇంతలో ఏమైఉంటుంది? అనుకుంటూ లోపలికి వెళ్లిన గంగాధారానికి శాస్త్రి పూలపాన్పు మీద హాయిగా నిద్రపోవడం చూసాడు. పక్కనున్నవాళ్ళు ఏడుస్తున్నారో, అరుస్తున్నారో అర్ధంకాలేదు అతనికి.
అందర్నీ గమనించిన గంగాధరం ఒక మూలగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు.
ఆయనకసలు జబ్బూ లేదండి, నిక్షేపంగా ఉండేవారు. రాత్రి ఏదో జాతకం తెమలటం లేదంటూ ఉదయం వరకు జాతక చక్రంతో కుస్తీ పడుతూనే ఉన్నారు. మరి ఏమైందో ఇలా అర్ధాంతరంగా...” అంటూ ముగించాడు.
ఇంతకూ మీరు?” ప్రశ్నార్ధకంగా అడిగాడు గంగాధరం.
నేను ఆయన శిష్యుడ్ని తలదించుకున్నాడు ఏడుపురాక.
**********
ఏంటీ శైలేంద్ర శాస్త్రి గారికే అంతుబట్టలేదా మీవాడి జాతకం? ఆయనవల్లే కాలేదంటే ప్రపంచంలో ఎవరివల్లా కాదనే అర్ధం కుండ బద్దలుగొట్టాడు విశ్వనాథ శాస్త్రి.
దైవాంశసంభూతులైన మీరే అలా అంటే నాకు ఇంకో మార్గం లేదు. మీరు తీసుకునేదానికంటే ఎక్కువ సంభావన ఇస్తాను, దయచేసి కాదనకండి అని ధీనంగా అడిగాడు.
ముత్యాలహారంతో వస్తేనే ఇంట్లో అడుగు పెట్టనిచ్చేదన్న తన రెండవ భార్య దమయంతి గుర్తుకు వచ్చింది విశ్వనాథానికి.
గంగాధరానికి హామీయిచ్చి పంపించాడు.
ఏమైందే, బాబు గుక్క పట్టి ఏడుస్తున్నాడు, పాలు పట్టావా లేదా?”
అబ్బా పట్టానండి, ఎందుకైనా మంచిదని డాక్టర్ కి కూడా చూపించాను
ఏమన్నారేంటి అని బాబుని ఎత్తుకున్నాడు.
ఏమీ లేదన్నారు..ఇదిగో అరుకిచ్చారుఒక పసుపు రంగు డబ్బాని చూపించింది.
సర్లే పిల్లలు ఏడిస్తే ఆరోగ్యం అని దుప్పటి ముసుగేసుకున్నాడు.
ఉదయాన నాలుగు గంటలకు ఏడుపాపి నిద్రపోయాడు బాబు.
తొమ్మిది గంటల ప్రాంతంలో వార్తలు చూస్తున్న గంగాధరం, ఒక వార్త చూడగానే గుండె ఆగినంత పనైంది.
ప్రముఖ జ్యోతిష్య పండితులు విశ్వనాథ శాస్త్రి హఠాన్మరణం అని టీవీ యాంకర్ చెప్పగానే ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు బాబు.
గంగాధారానికి అంతా అవగతమైంది, తన కొడుకిది మామూలు జాతకం కాదని.
**********
తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళిద్దరి పేర్లు కలిసేలా కొడుక్కి సుబ్బారావు అని పేరు పెట్టాడు.
మీవాడి అల్లరి రోజు రోజుకి మితిమీరిపోతోంది, టీచర్లందరూ మీవాడితో వేగలేక నాకొచ్చి కంప్లైంట్ చేసారు. మీవాడిని కొంచెం కంట్రోల్ లో పెట్టండి. మీకు చేతకాకపోతే చెప్పండి నేను కంట్రోల్ లో పెడతాను అని గట్టిగానే చెప్పాడు స్కూల్ ప్రిన్సిపాల్.
ఎవరి దగ్గర చిన్న మాట కూడా పడని గంగాధరం ప్రిన్సిపాల్ మాటలతో కోపోద్రిక్తుడయ్యాడు. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన కొడుకుని చెడామడా కడిగేసాడు. ఎప్పుడూ పల్లెత్తి ఒక్క మాట కూడా అనని తండ్రి ఇప్పుడు ఇంతలా రెచ్చిపోవడంతో ఏడుపు లంకించుకున్నాడు సుబ్బారావు.
ఇంతలో సులోచన వచ్చి కొడుకుని ఎత్తుకొని, “పిల్లలన్నాక అల్లరి చెయ్యరా? అయినా మీరు చిన్నప్పుడెంత అల్లరి చేసేవారో, మీ నాన్నని ఎంత ఇబ్బంది పెట్టేవారో...మావయ్య గారు ప్రతిరోజూ చెప్పేవారు, మర్చిపోయారా అని భర్త మీద ఎగిరిపడింది.
మరుసటి రోజు స్కూల్ కి వెళ్లిన సుబ్బారావు అరగంటలోనే ఇంటికి తిరిగోచ్చేసాడు.
ఏరా ఏమైంది? స్కూలుకెళ్లకుండా వచ్చేసావ్ అని అడిగిన గంగాధారంతోఇవాళ స్కూలుకి సెలవు అని ఆనందంగా చెప్పాడు.
ఎందుకు సెలవు?“
మా ప్రిన్సిపాల్ చనిపోయారంట నాన్న, అందుకే సెలవు.
మాటతో ఉలిక్కిపడి లేచాడు గంగాధరం.
**********
పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన రోజు. నాలుగు వందల మార్కులు రావడంతో తన తండ్రి దగ్గరకు భయం భయంగా వచ్చాడు సుబ్బారావు.
ఒక అయిదు వందలు వచ్చుంటే బాగుండేదిరా, పోనీలే కనీసం మార్కులన్నా వచ్చాయి అన్న గంగాధరం మాటలతో  స్థిమితపడ్డాడు సుబ్బారావు.
ఇంతలో పక్కింటి పరంధామయ్య వచ్చాడు.
నా మనవడికి 580 మార్కులు వచ్చాయి. జిల్లా టాపర్ మావోడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఊరుకోకుండాఇంతకీ మీవాడికి ఎంతొచ్చాయేంటి?” అన్న పరంధామయ్యతో మెల్లిగా “400” అన్నాడు గంగాధరం.
ఏంటీ 400 మార్కులా, అసలు మర్కులేనా అవి? నా మనవడిని చూడు పట్టుదలగా చదివాడు. నా పేరు, నా కొడుకు పేరు నిలబెట్టాడు వాడు. అసలే అంతంతమాత్రంగా ఉన్న నీ పరువుని మీవాడు ఇంకా దిగజార్చాడు అని గంగాధరం మీద ఇష్టమొచ్చినట్టుగా విసుర్లు విసుర్తున్నాడు.
మౌనంగా వింటున్నాడు గంగాధరం.
సుబ్బారావుకి మాత్రం చాలా కోపం వస్తోంది. కోపంగా గుడ్లు పెద్దవి చేసి పరంధామయ్యనే చూస్తున్నాడు. అది గమనించిన గంగాధరం పరంధామయ్య శివతాండవాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. పరంధామయ్య తగ్గట్లేదు. తన మనవడి గురించి ఉన్నవీ లేనివీ చెప్పి ఊదరగోట్టడమే కాక సుబ్బారావుని, గంగాధరం పెంపకాన్ని చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. చాలాసేపటి తర్వాత ఓపిక లేక పరంధామయ్య అక్కడ నుండి కదిలాడు.
హమ్మయ్య అనుకున్న గంగాధరానికి ఒక పెద్ద గావు కేక వినిపించింది.
మనవడికి జిల్లా ఫస్ట్ వచ్చిందన్న ఆనందంలో పరంధామయ్య గారు గుండె పోటుతో పోయారు చావు కబురు చల్లగా చెప్పింది సులోచన.
**********
సుబ్బారావు వయసు పెరగసాగింది. మరణాలు కూడా పెరగసాగాయి.
గంగాధారానికి తెలిసే చాలా మంది సుబ్బారావు వలన చనిపోయారు. తనకు తెలియకుండా ఇంకెంతమంది పోయుంటారో అని బాధపడేవాడు.
సుబ్బారావు విషయం గంగాధరం చాలా కాలం దాచినా అది దాగే విషయం కాదు గనక చాలా మందికి తెలిసిపోయింది.
కాలనీలోకి కొత్తగా ఎవ్వరూ అద్దెకు రావడం లేదు. ఉంటున్న వాళ్లు కూడా కాలీచేసి పోయారు. సొంత ఇళ్ళు ఉన్నవాళ్లు మాత్రం కదలలేని పరిస్థితి.
ఒకసారి పక్కింట్లో ఉండే ముకుందరావు గారింటికి వాళ్ళ అమ్మ చంద్రకాంతం కొన్ని రోజులు కోడలితో సేవలు చేయించుకుందామని దిగింది. చంద్రకాంతం అసలే గయ్యాళి. పాత సినిమాల్లో ఉండే సుర్యకాంతానికి ఏమాత్రం తీసిపోదు. అస్తమాను అందరితోనూ గొడవలు పడుతూనే ఉంటుంది. రోజు ఎవరితోనూ గొడవ పెట్టుకోకపోతే నిద్రపట్టదు కాంతానికి. చంద్రకాంతంతో గొడవలు పడిన చాలామంది అనేక రకాలైన క్షుద్ర పూజలు, చేతబడులు వగైరా లాంటివి చేయించినా ఫలితం లేకపోయింది.
ముకుందరావు సతీమని సుజాతకి అత్తంటే అస్సలు గిట్టదు. ముకుందరావుకి సుజాతనిచ్చి పెళ్లి చేసిన కీర్తిశేషుడైన కాంతం భర్త సన్నాసిరావుని, సుజాతని వేధించేది.
కాంతం గయ్యాలితనం భరించీ..సహించీ.. మధ్యనే సుఖమరణం పొంది విముఖ్తుడయ్యాడు సన్నాసిరావు.
ఇప్పటికీ ఏదో వంక పెట్టుకుని మరీ సుజాతని సాదిస్తోంది. అత్త మీద ఎంత కొపమున్నా తన భర్త కోసం అత్తగారు ఏమన్నా అనిగిమనిగి ఉంటుంది.
సుజాత కూతురు హారిక పదవ తరగతి చదువుతోంది. మేడపైన చదువుకుంటుండగా సుబ్బారావు అలా మేడ పైకి వచ్చాడు. సుబ్బారావుని చూసి పలకరించినట్టుగా నవ్వింది హారిక.
అప్పుడే మేడ పైకి వచ్చిన కాంతం తన మనవరాలిని చూసి నవ్వుతున్న సుబ్బారావుని చూసి పూనకం వచ్చినట్టుగా ఊగిపోయింది.
సుబ్బారావుని తన పల్లెటూరి నాటు భాషతో ఉతికారేయసాగింది. అసలే శాంత స్వభావం కలిగిన సుబ్బారావు కోపం వస్తున్నా హారిక ముందు చులకనవ్వడం ఇష్టంలేక నోరు మూసుకుని కాంతం బూతు పురాణాన్ని వింటున్నాడు.
ఇంతలో పైకి వచ్చిన సులోచన విషయం ఏమీ తెలుసుకోకుండా కాంతం మీద విరుచుకుపడింది.
ఏం పెంపకమే నీది, గౌరవంగా బతుకుతున్న అమ్మాయిల మీద పడమని కన్నావా ముళ్లపందిని ఊగిపోతోంది కాంతం.
మరీ అంత నాటు భాష కాకపోయినా తనదైన శైలిలో పోటీ ఇస్తోంది సులోచన. కాంతం మాత్రం సహన్నాన్ని కోల్పోకుండా సుబ్బారావు మీద తనకొచ్చిన బూతులు, రాని బూతులు, కొత్తగా సృష్టించిన బూతులు, అప్పటికప్పుడు ముత్యాల్లా రాలిపడే బూతులతో చెలరేగిపోతోంది.
అప్పుడే అక్కడకు తీరిగ్గా వచ్చిన సుజాత, అత్తని ఆపే ధైర్యం చేయలేకపోయింది. ఇంతలో ముకుందరావు అక్కడకు చేరుకొని కాంతానికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.
కాంతం అనుభవం ముందు సులోచన తేలిపోయింది. సులోచన నెమ్మదించడంతో శాంతించిన కాంతాన్ని బలవంతాన తీసుకెళ్ళాడు ముకుందరావు.
ఏమనుకోకండి సులోచనగారు, మా అత్తకి చాదస్తం ఎక్కువ అని నవ్వుతూ వెళ్ళింది సుజాత.
సుజాత ఎందుకు నవ్విందో అర్ధంకాలేదు సులోచనకి.
పొద్దున్నే బజారుకెళ్ళి తిరిగొచ్చిన గంగాధరం హడావిడిగా గదిలోకి దూరి ఫ్యాంటు మార్చుకుంటుండగాఏవండి! ఏంటా కంగారు? ఎక్కడికి వెళ్తున్నారు?”.
ముకుందరావు గారింటికి, నువ్వు కూడా రా.
ఎందుకండీ?” అన్న సులోచనతోపక్కింటి ముకుందరావు గారి అమ్మ గారు పోయారట అని చెప్పాడు.
సులోచన చక చకా చెప్పిన విషయం విన్నాక చక చకా కూలిపోయాడు గంగాధరం.
భర్త కింద పడిపోవడంతో కంగారుపడిన సులోచన చెంబుతో నీళ్ళు తెచ్చి అతని ముఖాన కొట్టింది.
ఇదంతా మనవాడి మహిమా? ఇంకా ఏం ముఖం పెట్టుకుని వెళ్ళాలి?” నీరసంగా చెప్పాడు.
చాల్లే ఆపండి, ముసలి వయసు..పోయింది. అంతేకాని దానికి మనబ్బాయికి ముడి పెట్టకండి అని కసురుకుంది.
వెళ్ళొస్తానమ్మ అని కాలేజీకి బయల్దేరాడు సుబ్బారావు.
సులోచనని ఇంకో చెంబు నీళ్ళు తెమ్మని చెప్పి, నీళ్ళను నెత్తి మీద పోసుకున్నాడు.
అప్పటినుండి ఇరుగు పొరుగు వాళ్లకు సుబ్బారావుతో ఎటువంటి సమస్యా రాలేదు.
**********
మీ అబ్బాయి ఆల్ ఇండియా లెవెల్ లో 50 ర్యాంకు సాధించడం పట్ల మీ అభిప్రాయం?” అని విలేఖరి అడిగిన ప్రశ్నకుచాలా సంతోషంగా ఉంది ఆశ్చర్యపోతూ చెప్పాడు గంగాధరం.
మా అబ్బాయి మహర్జాతకుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది సులోచన.
సుబ్బారావు తల్లితండ్రుల మధ్యన కుర్చుని విలేఖరి అడుగుతున్న ప్రశ్నలకు నింపాదిగా సమాధానాలు చెబుతున్నాడు.
గంగాధరానికి అంతా అయోమయంగా ఉంది. ఫ్యామిలీ ఫోటో తీసుకుంటాం ఒక్కసారి నవ్వమని చెప్పినా, నవ్వు రావడం లేదు గంగాధరానికి. ఆశ్చర్యం, భయం కలగలిపిన ముఖకవళికలతో ఫోటో దిగాడు.
రోజు మా వాడి ఇంటర్వ్యూ టీవీ లో వస్తుంది చూడండంటూ తెలిసిన వాళ్లకు, తెలియనివాళ్ళకు కూడా చెప్పేసాడు గంగాధరం. సులోచన తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి మరీ చెప్పింది. రోజు గంగాధరం ఇంట్లో తప్ప మరే ఇంట్లోను టీవీ పెట్టలేదు. టీవీ పెట్టడానికి భయపడ్డ ఆడవాళ్ళు సీరియళ్ళను కూడా త్యాగం చేసారు.
టీవీలో ఇంటర్వ్యూ చుసిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు గంగాధరానికి. “వివిధ రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో నిన్న ఒక్క రోజే 50 మంది దుర్మరణం అని హెడ్ లైన్స్ లో చూసాక వెక్కి వెక్కి కుమిలిపోయాడు గంగాధరం.
భగవంతుడికి ఎక్కువ మంది చనిపోవడం ఇష్టంలేక సుబ్బారావుకు 50 ర్యాంకు ఇచ్చాడు, దేవుడున్నాడు రెండు చేతులూ జోడించాడు గంగాధరం.
**********
నువ్వన్నా చెప్పవే, వీడిని మన సూపర్ మార్కెట్ చూసుకోమని కోపంగా వేడుకున్నాడు సులోచనని గంగాధరం.
ఒరేయ్ నాన్నా నువ్వు ఈయన మాటలేమీ పట్టించుకోకు, నువ్వు హైదరాబాద్ వెళ్ళు కొడుకుని సమర్ధించింది తల్లి.
గంగాధరం పళ్లు పట పటా కొరుకుతూ కోపంగా చూస్తున్నాడు సులోచనని.
అలా మిర్రి గుడ్లేసుకుని చూస్తారేంటండి, కొడుకుని డాక్టర్ గా చూడడం ఇష్టం లేదా మీకు? మనబ్బాయికి ఉస్మానియాలో ఎం.బి.బి.ఎస్(MBBS) సీట్ వచ్చింది అంటూ గంగాధరం మీద ఎగిరింది.
వాడు హైదరాబాద్ వెళ్ళడం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు  అని కరాఖండిగా చెప్పాడు గంగాధరం.
**********
అయిదు సంవత్సరాలు గడిచాయి.
MBBS  పూర్తి చేసి ఇంటికి వచ్చిన కొడుకుతోఏరా హైదరాబాద్ జనాభా చాలా దారుణంగా తగ్గిపోయిందటరా..నిన్ననే పేపర్లో చదివాను అంటూ పేపర్ తీసుకురావడానికి కదిలాడు గంగాధరం.
అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన కొడుకుతో ఎలా ఉన్నావని అడక్కుండా, ఎంతమంది పోయారని అడిగి వాడికి చిరాకు తెప్పించకండి అని సుబ్బారావుని కుశల ప్రశ్నలడిగింది.
ఢిల్లీ అపోలో హాస్పిటల్ లో తనకు ఉద్యోగం వచ్చిందని, రేపే బయల్దేరాలని చెప్పిన సుబ్బారావుతోఅయితే ఢిల్లీ జనాభా తగ్గబోతోందన్న మాట అంటూ కొడుకు భుజంపై చెయ్యి వేసాడు.
భర్త మాటలు విని దోసెలు వేస్తున్న సులోచన అట్లకాడతో చల్లగా గంగాధరం చెయ్యికి అంటించింది.
బాధకి పెద్ద కేక పెట్టాడు గంగాధరం.
నీ కొడుకు మీద ఎంత ప్రేముంటే మాత్రం కట్టుకున్న మొగుడికి వాత పెడతావా?” అని చేతిని ఊదుకుంటున్నాడు గంగాధరం.
వెంటనే సుబ్బారావు ointment తీసి తండ్రి చేతికి రాయడం మొదలెట్టాడు.
చూసారా! వాడు డాక్టర్ అవ్వడం వల్ల మీకు మందు రాస్తున్నాడు. కానీ మీరు వచ్చినప్పట్నుండి మీ పిచ్చి మాటలతో వాడికి చురకలు పెడుతున్నారు అని మూతి మూడు వంకర్లు తిప్పింది.
అందుకని నాకు పెట్టావా చురక! ఐనా నువ్వేంటే వాడేదో నాకు ointment రాయడానికే డాక్టర్ అయ్యినట్టు మాట్లాడుతున్నావు. నేను రాసుకోలేనా?”.
సుబ్బారావు మౌనంగా తనలో తనే నవ్వుకుంటున్నాడు.
**********
నాన్నా నేను కాకుండా అమ్మాయి పుట్టుంటే ఏం చేసేవాడివి?”.
ఏముందిరా నీలానే డాక్టర్ నో, ఇంజనీర్ నో చేసేవాడిని టక్కున బదులిచ్చాడు గంగాధరం.
అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయిని కూడా కనేవాడివి కదూ?”.
మా అమ్మకు ఏడుగురు సంతానం. మమ్మల్నందర్నీ పెంచడానికి నా తల్లిదండ్రులు పడ్డ కష్టాలు చూస్తూ పెరిగిన నేను, తప్పు ఎందుకు చేస్తాను? అమ్మాయైనా అబ్బాయైనా ఒక్కర్నే మనం భూమ్మీద పడేస్తే, అదే దేశానికి మనం చేసే పెద్ద మేలు అని కొడుకు రెండు భుజాలపై చెయ్యి వేసాడు.
నాన్నా అమ్మ జాగ్రత్త తండ్రిని కౌగిలించుకున్నాడు.
క్షణం పుత్రోత్సాహానికి లోనయ్యాడు గంగాధరం. కళ్ళ నుడి నీళ్లు కారాయ్. అప్పుడర్ధమైంది గంగాధరానికి, తల్లిదండ్రులంటే రంగారావుకు ప్రాణమని.
భారత దేశం అధిక జనాభాతో బాధపడుతోంది. దేశం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ప్రధాన కారణం అధిక జనాభా. సమస్యను పరిష్కరించడానికే రంగారావు పుట్టాడు అని సమర్ధించుకున్నాడు గంగాధరం.
మీ అబ్బాయి పుట్టుక వలన దేశానికేదో మహత్కార్యమే జరగనుంది అన్న శైలేంద్ర శాస్త్రి మాటలు గుర్తుకువచ్చాయి గంగాధరానికి.
నా కొడుకు మహర్జాతకుడు.
ట్రైన్ కదలడంతో సుబ్బారావు ట్రైన్ ఎక్కాడు.
నాన్నా ఉంటా అన్నట్టుగా చెయ్యి ఊపుతున్నాడు సుబ్బారావు.
గంగాధరం కూడా చాలా హుషారుగా చెయ్యి ఊపుతున్నాడు.
గంగాధరానికి క్షణం ట్రైన్ లో వెళ్తున్న సుబ్బారావు,  ప్రాణాలు హరించడానికి వెళ్తున్న యముడిలా కనిపించాడు.

Comments System

Disqus Shortname

Disqus Shortname

Comments system